ఎన్‌సీపీ ఎమ్మెల్యే కరోనాతో మృతి...


ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి చాలా మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ భాల్కే శనివారం కన్నుమూశారు. అక్టోబరు 30న ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కేకు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో పూణే నగరంలోని రూబీ ఆసుపత్రిలో చేరారు.

కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు పలు అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో మళ్లీ నవంబరు 9న ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శనివారం ఉదయం కన్నుమూశారు.

మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పంధర్పూర్-మంగళవేద నియోజకవర్గం నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత ఎన్‌సీపీ నుంచి పోటీ చేసి భాల్కే విజయం సాధించారు. ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో సమచారం అందుకున్న ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆసుపత్రికి చేరుకోని శుక్రవారం సాయంత్రం భాల్కేను పరామర్శించారు. ఆయన మరణం పట్ల పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు.