ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైన మీడియం పేసర్ టీ నటరాజన్ (29) తన కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందంటూ మురిసి పోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్బౌలర్ గా మాత్రమే ఎంపికైన తాను ప్రస్తుతం ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు.
పాపాయి ఫోటో కూడా తానింకా చూడలేదని, వీడియోకాల్లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరోరెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు. అలాగే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు..
అయితే తన బిడ్డను చూసేందుకు మాత్రం నటరాజన్ మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అతను మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే, అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.