విజయనగరం జిల్లాలో పురాతనకాలం నాటి రాముడి విగ్రహం ధ్వసం..


విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో కోదండరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి ఆలయం తలుపులు పగలగొట్టి రాముడి విగ్రహం తల భాగాన్ని ధ్వంసం చేశారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర గలిగిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన అర్చకుడు ప్రసాద్‌ రావు విషయాన్ని గమనించి దేవస్థానం ఉన్నతాధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆలయానికి వచ్చి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరిసర ప్రాంతాల్లో మరిన్ని వివరాలు సేకరించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి సీరియస్‌ అయ్యారు. రాముడి విగ్రహం ఘటనపై జిల్లా ఎస్పీతో మంత్రి వెల్లంపల్లి ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రి ఆదేశించారు