భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మంత్రి తలసాని


వాతావరణ శాఖ సూచనల ప్రకారం రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రజలు కూడా ఇండ్లలోనే ఉండాలని కోరారు.

అన్ని స్థాయిల అధికారులు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలలోని ప్రజలను జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్ లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పరిస్థితులు అర్ధం చేసుకుని అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు మీమీ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.