తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మంత్రి కిషన్ రెడ్డి


తెలంగాణలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరబాద్‌ నగరం అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు సహా ప్రముఖులు వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం ఉదారత చాటారు. బాధితులను ఆదుకునేందుకు కిషన్‌రెడ్డి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే తమ వంతు సాయం కింద టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ఆగ్ర హీరోలు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించారు. అంతేగాక పలు రాజకీయ నేతలు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే వరద బాధితులకు విరాళాలు ప్రకటించారు. వరద తాకిడితో పట్టణంలోని పలు కాలనీలు పెద్ద కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో చాలా చోట్ల అడుగు బయట పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌ వరదల వల్ల సామాన్య జనం నుంచి ధనిక ప్రజల వరకు నిత్యావసర సరకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద రూ.550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.