ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలి ..వినాయక చవితి , మొహరం పండుగలపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి


కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో నిబంధనలకు అనుగుణంగా వినాయకచవితి ఉత్సవాలు, మొహర్రం జరుపుకోవాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. సామూహిక ప్రార్థనలు, ఊరేగింపుల కారణంగా వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నదని చెప్పారు. కొవిడ్‌-19 నిబంధనల కారణంగా సామూహికంగా వినాయకచవితి ఉత్సవాలు, నిమజ్జనానికి, మొహర్రం నిర్వహణ, ఊరేగింపులకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లుచేయడం కుదరదని ఆయన స్పష్టంచేశారు.

ఈ విషయాన్ని ప్రజలు అర్థంచేసుకుని ఇండ్లలోనే ఉత్సవాలు, పండుగలు, మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. కరోనా బారినపడకుండా భౌతికదూరం పాటించడం అనివార్యమైన నేపథ్యంలో ప్రజలు ఒకేచోట గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతున్నదని తెలిపారు. కరోనాపై పోరులోభాగంగా సామూహిక ఉత్సవాలకు అనుమతివ్వొద్దని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

కాగా రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఈ సారి వినాయక చవితి సామూహిక ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు..ఎవరి ఇంట్లో వారే పండుగ చేసుకోవాలని సూచించింది..అయితే ఈ నిర్ణయం పై బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది..హిందువుల పండుగలపై కెసిఆర్ ప్రభుత్వం వివక్ష చేయిస్తుంది అని బీజేపీ మండిపడింది