సీబీఎస్ఈ సిలబస్ కుదింపుపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మమత బెనర్జీ



కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం పాఠశాలలు ప్రారంభం అయ్యే అవకాశాలు లేకపోవడంతో సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 9 నుంచి 12 తరగతులకు సిలబస్ తగ్గించాలని నిర్ణయించింది ..ముఖ్యమైన సిలబస్ ను అలాగే ఉంచి అవసరం లేని వరకే తగ్గించాము అని సీబీఎస్ఈ తెలిపింది.

అయితే సిలబస్ తగ్గించిన తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తప్పుబట్టారు. పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థ, దేశ విభజన వంటి అంశాలపై పాఠ్యాంశాలను తొలగించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మమత బెనర్జీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ముఖ్యమైన పాఠాలను తొలగించవద్దని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరారు. ‘కోవిడ్ సంక్షోభ సమయంలో సీబీఎస్ఈ కోర్సు కుదింపు పేరుతో పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం, దేశ విభజన వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. దీనికి మేము గట్టిగా అభ్యంతరం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముఖ్యమైన పాఠాలను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, హెచ్ఆర్‌డీ మినిస్ట్రీలను కోరుతున్నాను’’ అని మమత పేర్కొన్నారు.