హత్రాస్‌ హత్యాచార ఘటనపై యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన మమతా బెనర్జీ


హత్రాస్‌ హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. యూపీలో దళితులు, మైనారిటీలు, ఆదివాసీలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా అర్ధరాత్రి దహనం చేయడాన్ని సీతాదేవి అగ్నిపరీక్షతో పోల్చారు.

మరో సీతను అగ్నిపరీక్షకు గురిచేశారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. హత్రాస్‌లో బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడటమే కాదు ఆమె మృతదేహాన్ని పోలీసులు దహనం చేశారు. ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులు విచారిస్తారు. ఆ రాష్ట్రంలో నిబంధనలు ఎలాంటివని యూపీ పోలీసులపై దీదీ ధ్వజమెత్తారు. బాధితురాలి తల్లినీ తన కుమార్తెతో సహా దహనం చేస్తామని పోలీసులు బెదిరించారని ఆమె ఆరోపించారు..

యూపీలో దళిత యువతిపై హత్యాచార ఘటన సిగ్గుచేటని, బాధిత కుటుంబానికి సంతాపం తెలియచేస్తున్నానని అంతకుముందు మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. కుటుంబ అనుమతి లేకుండానే బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా దహనం చేయడం సిగ్గుచేటని, ఊకదంపుడు వాగ్ధానాలతో ఓటల్ను కొల్లగొట్టని నేతల తీరును ఈ ఘటన తేటతెల్లం చేస్తోందని దుయ్యబట్టారు