మలయాళ సంచలన దర్శకుడు సాచీ కన్నుమూత


ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల గ్యాప్‌లోనే చిరంజీవి సర్జ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి స్టార్ హీరోలు కన్నుమూసారు. వాళ్లతో పాటు ఇంకా చాలా మంది 2020లోనే మరణించారు. ఇలా వరస షాకుల మధ్య ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది.

ఈ మధ్యే మలయాళంలో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్లాక్‌బస్టర్ సినిమా అయ్యప్పనమ్ కోషియమ్ చిత్ర దర్శకుడు సాచీ కన్నుమూసాడు. ఈయనకు మూడు రోజుల కింద గుండెపోటు రావడంతో వెంటనే ఈయన్ని హాస్పిటల‌్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న దర్శకుడు మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయాడు. మూడు రోజులుగా ఈయన్ని బతికించడానికి డాక్టర్లు చేసిన శ్రమ వృథా అయిపోయింది.

వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా కూడా ఈయన ఆరోగ్యం కుదుటపడలేదు. జూన్ 18 రాత్రి సాచి కన్నుమూసాడు. కొన్నేళ్లుగా ఈయన గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. రైటర్ నుంచి అనార్కలి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత అయ్యప్పనమ్ కోషియమ్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకుని మలయాళంలో ఒక్కసారిగా టాప్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

కేవలం 5 కోట్లతో తెరకెక్కిన అయ్యప్పనమ్ కోషియమ్ 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇలాంటి సమయంలో ఈయన మరణం అందరినీ కలిచివేస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని మలయాళ చిత్ర పరిశ్రమ చేసిన ప్రార్థనలు అన్నీ వృథా అయిపోయాయి. సాచి మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి.