145 పాఠశాల భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి


మధ్యప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన 145 పాఠశాల భవనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రూ.497.70 కోట్లతో ఈ భవనాలను నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాల నిర్మాణంతోపాటు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాల్లో తరగతి గదులతోపాటు ప్రయోగశాలలు (ల్యాబ్స్‌), గ్రంథాలయం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు.

విద్యార్థులకు విద్యతోపాటు మంచి పాఠశాల భవనాలు కూడా అందుబాటులో ఉంచడం ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యనందించేందుకు ప్రభుత్వం కొత్తగా 10 వేల పాఠశాలలను ప్రారంభించబోతోందని వెల్లడించారు. పేదల జీవితాల్లో మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.