చివరి దశకు చేరుకున్న లాక్ డౌన్ 4.0...తర్వాతి దశల్లో నిబంధనలపై ప్రజల్లో ఆసక్తి

కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ నాలుగవ దశ కూడా ముగింపుకు చేరుకుంది ..తొలి రెండు దశల్లో ఎటువంటి సడలింపులు లేకుండా పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా కేసుల సంఖ్య మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది ..దీనితో తరువాతి దశల్లో దేశంలో అంచలంచలుగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు ..తాజాగా నాలుగవ దశ లాక్ డౌన్ కూడా ముగుస్తుండటంతో అయిదవ దశలో ఏ రంగాలకు సడలింపులు ఇస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ..

పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వీటికి తుదిరూపం ఇస్తోంది. ప్రధానంగా పర్యాటక, అతిథ్య రంగాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈసారి నిబంధనలు ఉండబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ప్రకారం, హోటల్స్, డైన్-ఇన్ రెస్టారెంట్లు, బీచ్‌లు ఐదో విడత లాక్‌డౌన్‌లో తెరిచే అవకాశాలున్నాయి.

టూరిజం, ఆతిథ్య రంగాలపై ప్రధానంగా ఆధారపడే రాష్ట్రాలు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆ రంగాల్లో సడలింపులు ఇవ్వాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్నాయి. టూరిజం, ఆతిథ్య రంగాలకు లాక్‌డౌన్ 5.0లో ఉపశమనం కలిగే అవకాశం ఉంది' అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పుదుచ్చేరి, కేరళ, గోవా, కొన్ని ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా పర్యాటకం, ఆతిథ్య రంగంపై ఆధారపడి ఉన్నాయి. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఇప్పటికీ ఆ రాష్ట్రాలకు ఎలాంటి ఉపశమనం కలగ లేదు. 50 శాతం సామర్థ్యం, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలతో టూరిజం, ఆతిథ్య రంగాలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫోనులో తెలియజేశానని, జిమ్‌లు కూడా తెరవాలని చాలామంది కోరుతున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చానని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ మహాజన్ ఇప్పటికే వెల్లడించారు. లాక్‌డౌన్ మరో 15 రోజులు పొడిగించాలని కూడా ఆయన కేంద్రానికి సూచించారు.