రంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాలలో చిరుతల సంచారం


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి బుగ్గ సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఓ టిప్పర్ డ్రైవర్ చిరుత తిరగడాన్ని సెల్ ఫోన్ చిత్రీకరించాడు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిరుతను వెంటనే పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చిరుత సంచారం మళ్లీ కలకలం సృష్టిస్తోంది. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మేనేజ్ సంస్థకు వెళ్లే దారిలో చిరుత తిరగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో వర్సిటీ సెక్యూరిటీగార్డులు ఉలిక్కిపడ్డారు. జాగ్రత్తగా ఉండాలని యూనివర్సిటీ చుట్టు ఉన్న కాలనీవాసులకు సూచించారు పోలీసులు.


మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండల్ గ్రామ శివారులో చిరుతపులి స్థానికుల్ని హడలెత్తించింది. తొనిగండల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సూరన్న గారి భూపాల్‌కు గ్రామ శివారులో తన గొర్రెల మందకు కొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన జీవాలను కొట్టంలో ఉంచి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు.

తెల్లవారుజామున కొట్టంలోకి వెళ్లి చూడగా ఓ గొర్రె చనిపోయి ఉండగా మరో రెండు గొర్లు కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. గ్రామ సర్పంచ్ విషయం తెలియగానే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎనిమిది నెలలుగా రాని చిరుత మళ్లీ గ్రామ శివారుకు వచ్చి పశువులపై దాడులు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.