దడ పుట్టిస్తోన్న ధరణి పోర్టల్.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్తుల మొత్తాన్ని ఆయనా యజమానులు తమ వివరాల్ని ధరణి వెబ్ సైట్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కొన్ని లక్ష్యాల్ని పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 10 లోపు ధరణి వెబ్ సైట్ లోకి ఆస్తుల వివరాల్ని అప్ లోడ్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఇందులో భాగంగా అన్ని విభాగాల అధికారుల్ని రంగంలోకి దించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీదా ఆస్తుల నమోదు ఒక లెక్క అయితే.. హైదరాబాద్ మహా నగరంలోని ఆస్తుల్ని అప్ లోడ్ చేయటం మరో లెక్కగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 20 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటిని ధరణి పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్న టాస్కు భారీగా మారింది.

గడిచిన కొద్దిరోజులుగా ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తున్నా.. ఇప్పటికి గ్రేటర్ పరిధిలో కేవలం లక్షన్నర నుంచి 2 లక్షల అప్లికేషన్లు మాత్రమే నమోదు అయినట్లుగా చెబుతున్నారు. ఈ లెక్కన మిగిలిన 18 లక్షల ఆస్తుల్ని ఎప్పటికి నమోదు చేస్తారన్నది ప్రశ్న.

మరోవైపు.. ఆస్తుల నమోదుకు ఆఖరి తేదీ ఈ నెల 10 వరకు మాత్రమే పెట్టారు. అలాంటివేళ.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కాని ఆస్తుల విషయాన్ని ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న. అధికారులు ఇళ్లకు వచ్చి.. వివరాలు నమోదు చేసే కార్యక్రమం ఆలస్యం అవుతున్న వేళ.. అందుకు భిన్నంగా కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎవరికి వారుగా ధరణి పోర్టల్ కు సంబంధించి ఒక లింకు ఇచ్చి ఆస్తుల నమోదును సేకరించాలని కోరింది ప్రభుత్వం. అయితే.. ఈ లింకును ఓపెన్ చేసిన వారందరికి చుక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇందులో తమ ఆస్తుల్ని నమోదు చేయటం కంటే.. ఎర్రటి ఎండలో అరగంటసేపు నిలబడటమే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

సాంకేతికంగా అడ్వాన్డ్స్ గా ఉన్న వేళలోనూ.. ఆస్తుల నమోదుకు ఇన్ని అవస్థలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎంతకూ ఆస్తుల నమోదు ఆన్ లైన్ లో సాధ్యం కాని వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నట్లుగా ఈ నెల 10 నాటికి ఆస్తుల నమోదు పూర్తి అయ్యే అవకాశం లేదని.. ఆలస్యం కావటం ఖాయమంటున్నారు. మరి.. ఆస్తుల నమోదు ఆలస్యమైతే.. ఏం జరుగుతుందన్న ప్రశ్నకు అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటంతో.. ఆయోమయంతో ఆగమాగమైపోతున్నారు.