శబరిమల వెళ్లే భక్తులకు సూచనలు చేసిన కేరళ ప్రభుత్వం


శబరిమల ఆలయం భక్తుల కోసం మరోసారి తెరుచుకోనుంది. శుక్రవారం (అక్టోబర్ 16) నుంచి ఐదు రోజుల పాటు నెలవారీ కైంకర్యాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

దీంతోపాటు.. శబరిమల యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు రానున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.

కేరళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు పైబడిన వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలను యాత్రకు అనుమతించరు. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా శబరిమల యాత్రకు రాకూడదని స్పష్టం చేశారు.

దర్శనానికి 48 గంటల ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటివ్‌ వచ్చిన వారినే అనుమతిస్తారు. ఇక కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసచేయడం లాంటి వాటిని నిషేధించారు.యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్య బీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.