జూన్ 21 వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం


ఈ సంవత్సరం సూర్యగ్రహణం జూన్ 21న ఆదివారం ఉదయం ఏర్పడనుంది. ఈ గ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాగా వలయాకారంలో కనువిందు చేయనుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో ‘జ్వాలా వలయం’ ఏర్పడుతుంది. జూన్ 21న ఆదివారం ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది.

భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చి చంద్రుడి నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజులలోనే జరుగుతుంది. అయితే, అన్ని అమావాస్యలలోనూ గ్రహణాలు ఏర్పడవు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చి సూర్యుడు పూర్తిగా కనిపించకపోతే సంపూర్ణ సూర్యగ్రహణంగా, కొంతమేరకే కనిపించకపోతే పాక్షిక సూర్యగ్రహణంగా చెబుతారు.

వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.

భూమి నుంచి భూమి అత్యంత దూరంలో ఉండే ప్రదేశాన్ని అపోజీగా పిలుస్తారు. చంద్రుడు అపోజీలో ఉన్నప్పుడు, భూమిపైకి సాధారణం కంటే కాస్త చిన్నగా కనిపిస్తాడు. ఆ తరుణంలో సూర్యగ్రహణం ఏర్పడితే, సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి ఉంటుంది.


చంద్రబింబం మూసినంత మేర మూయగా దాని చుట్టూ కనిపించే సూర్యబింబం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే ‘యాన్యులర్‌’ లేదా వలయాకార గ్రహణంగా పేర్కొంటారు.

ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ కారిడార్ వెంట గరిష్టంగా 30 సెకన్ల పాటు ముత్యాల హారంగా సూర్యుడు కనిపిస్తాడు.

ఈ గ్రహణం సమయంలో సూర్యుడి కరోనా, సౌర డిస్క్ చుట్టూ ఒక ప్రకాశవంతమైన దృశ్యంలా కనిపించే అవకాశం ఉంది. కాగా, ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడరాదని, దీని వల్ల శాశ్వతంగా అంధత్వం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.