అంతర్వేది రథం దగ్ధం ఘటనపై తీవ్రంగా స్పందించిన జనసేన అధినేత


తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు పవన్ ఓ వీడియోను రిలీజ్ చేసారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట ఇప్పుడు అంతర్వేది. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికాలు కావని అన్నారు. ఎన్నిరథాలు దగ్ధం అవ్వడం... విగ్రహాల ధ్వంసాలు అవ్వడం యాదృశ్చికంగా జరిగాయని ప్రభుత్వం చెబుతుందని మండిపడ్డారు.

మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అని చెబితే పిల్లలు కూడా నవ్వుతారని అన్నారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే స్పందించి ఉంటే ఈ ఘటనలు జరిగేవా అని ప్రశ్నించారు. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఇతరమతాల పెద్దలు ఈ ఘటనను ఖండించాలని వ్యాఖ్యానించారు.

కాగా అంతర్వేది ఘటనపై డిజిపి మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశాం. కేసు దర్యాప్తులో ఇప్పటికే పురోగతి సాధించాం. పూర్తి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తాం. దోషులు ఎంతటి వారైనాసరే ఉపేక్షించం. మరోవైపు ఈ సంఘటనను అవకాశంగా చేసుకుని సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించాలని యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పరిస్థితి అంతా అదుపులో ఉంది. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం.