‘జగనన్న అమ్మ ఒడి’ పథక౦లో ఈసారి అకౌంట్లలో రూ. 15 వేలు....


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి సురేష్ ప్రకటించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఈ అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి విడతల వారిగా రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం వర్తించేలా చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. గత ఏడాది 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. 6,300 కోట్లు జమ చేసినట్లు మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఈసారి దాదాపు రెండు రెట్లు అధికంగా లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు. ఇక, రేషన్ కార్డులు, అమ్మ ఒడి తొలగిస్తున్నామని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ కొట్టిపారేశారు. ఎన్ని లక్షల మంది అర్హులు ఉన్నా అందరికీ పథకాలను అందిస్తామని ప్రకటించారు.