జగన్ ఢిల్లీ పర్యటన బీజేపీ రాజకీయమా... ‌


ఢిల్లీలో మంగళవారం రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమవుతారు. తుఫాను కారణంగా ఆస్తి నష్టం గురించి వివరించి తక్షణమే సహాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరనున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో తీరని సమస్యలను సీఎం అమిత్‌ షాతో చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని బీజేపీ వర్గాలు టాక్.

వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు అమిత్‌ షా ముఖ్యమంత్రి జగన్‌ను కోరనున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్‌కు కూడా అపాయింట్‌మెంట్‌ లభించినట్లు చెబుతున్నారు. జగన్‌ను కేంద్రమే ఢిల్లీకి పిలిపించిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్, పలువురు కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. కేసీఆర్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.