IPL 2020: ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి నోట.. క్రికెట్ గురించి ఊహించని మాట!

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగా, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఫామ్‌లోకి రావడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరో మారు అర్ధ సెంచరీతో మెరిశాడు. మొత్తం 45 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 6 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేయగా, తొలుత నెమ్మదిగా ఆడిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకున్నాక జోరు పెంచాడు.

లక్ష్యం చిన్నదే కావడంతో ఎటువంటి తొట్రుపాటు లేకుండా జాగ్రత్తగా ఆడాడు. అనవసర షాట్లకు పోకుండా చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. డివిలియర్స్ 12 పరుగులు చేశాడు. ఈ గెలుపుతో బెంగళూరు 6 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.


అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్‌మెన్ అనవసర షాట్లకు పోయి చేజేతులా వికెట్లు చేజార్జుకున్నారు. చేతిలో బోల్డన్ని ఓవర్లు ఉన్నా ఎవరో తరముకొస్తున్నట్టు బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచే ఉద్దేశంతో బ్యాట్ ఝళిపిస్తూ వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు.

కొత్త కుర్రాడు లోమ్రోర్ 47 పరుగులు చేయడంతో రాజస్థాన్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. జోస్ బట్లర్ 22, రాహుల్ తెవాటియా 24 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ స్మిత్ 5, శాంసన్ 4, ఉతప్ప 17, రియాన్ పరాగ్ 16, జోఫ్రా అర్చర్ 16 పరుగులు చేశారు.

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకోవడం పట్ల, తను తిరిగి ఫామ్‌లోకి రావడం పట్ల కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్‌ ఓ అద్భుతమైన ఆట.. దీన్ని (క్రికెట్‌ను) ఎంతగానో ప్రేమిస్తాను.. అలాగే ద్వేషిస్తాను కూడా. ఫామ్‌లో లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.

కానీ టీం బాగా ఆడుతున్నప్పుడు.. ఫామ్‌లోకి రావడానికి కొంత సమయం దొరుకుతుంద’’ని వ్యాఖ్యానించాడు. ‘ఐపీఎల్‌ చూస్తుండగానే ముగింపు దశకు వస్తుంది. ఒకవేళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడితే.. మనం రియలైజ్ అయ్యే సరికే 8 మ్యాచ్‌లు పూర్తవుతాయి. కానీ మన ఖాతాలో పాయింట్లు ఉండవు. కాబట్టి మనం విజయాలను కొనసాగించాల’ని కోహ్లి అభిప్రాయపడ్డాడు.

దేవ్‌దత్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అతడిలో గొప్ప ప్రతిభ దాగి ఉంది. దత్ చక్కగా షాట్లు కొట్టగలడు. అతడు రిస్క్ తీసుకుంటున్నాడని అనుకోలేం. ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడని పడిక్కల్‌పై కోహ్లి ప్రశంసలు గుప్పించాడు.