మరో వివాదంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైదరాబాద్ లో నివాసముంటున్న ఇంటి వ్యవహార౦ ప్రస్తుతం గవర్నర్ వద్దకు చేరింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సమస్య నుంచి నిమ్మగడ్డ ఎలా బయటపడతారో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని హౌస్ అలవెన్స్ విషయంలో మోసం చేస్తున్నారని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ఫిర్యాదు చేసింది. ఏపీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం నుంచి జీతం, ఇంటి అద్దె అలవెన్సు పొందుతూ ఏపీలో నివసించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ సంస్థ.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వం నుంచి నెలకు 3 లక్షల 19 వేల 250 రూపాయల జీతం పొందుతున్నారు. కానీ, రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్ లోనే నివాసముంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న నివాసానికి హౌస్ అలవెన్స్ తీసుకుంటున్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం పొందిన వేతన వివరాల్ని ఇతర ఆధారాల్ని ఫిర్యాదుకు జత చేర్చారు. రాజ్యాంగబద్ధ అధికారాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు, అధికార్లకు ఆదర్శంగా ఉండాలని ఇలా ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి మారినప్పుడు సరైన సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్న సంగతిని ఫిర్యాదుదారులు గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం విజయవాడకు నివాసం మార్చకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలిపారు.