Flash News: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం...!

దుబ్బాక ఉప ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలో భారీగా నగదు బయటపడింది. దుబ్బాక ఎలక్షన్‌కు తరలిస్తున్న డబ్బును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు కోటి రూపాయలకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు.

దుబ్బాకలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు హవాలా మార్గంలో నగదును తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు రోజులుగా హవాలా డబ్బులపై పోలీసులు దృష్టి పెట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించగా ఈ డబ్బు బయటపడింది.

ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఇంత భారీ సొమ్ము ఎక్కడిది? కచ్చితంగా ఎటు తరలిస్తున్నారు? అనే అంశాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. హవాలా సొమ్ము తరలింపుపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనరల్ అంజనీ కుమార్‌ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇవాల్టితో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ప్రచార సమయం ముగుస్తుండటంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలు డబ్బులు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ డబ్బులు పెద్ద మొత్తంలో అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజా సొమ్ము బీజేపీ అభ్యర్థికి చెందినదిగా పోలీసులు చెబుతున్నారు.