‘జీ20 గ్లోబల్‌ స్మార్ట్‌ సిటీస్‌ అలయెన్స్‌'లో మార్గదర్శక నగరం హోదాలో హైదరాబాద్..‌


భద్రత, పాలన, భౌగోళిక అంశాల పరంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) చేపట్టిన ‘జీ20 గ్లోబల్‌ స్మార్ట్‌ సిటీస్‌ అలయెన్స్‌'లో మార్గదర్శక నగరం హోదాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి డబ్ల్యూఈఎఫ్‌ చేపట్టిన మార్గదర్శక ప్రణాళికను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 36 నగరాలను ఎంపిక చేశారు. ఆరు ఖండాల్లోని 22 దేశాల నుంచి ఈ నగరాలను ఎంపిక చేయగా, భారత్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, ఫరీదాబాద్‌, ఇండోర్‌లకు మాత్రమే చోటు దక్కింది. లండన్‌, మాస్కో, టొరంటో, బ్రెసీలియా, దుబాయ్‌, మెల్‌బోర్న్‌ వంటి ప్రపంచస్థాయి నగరాలతో కలిసి హైదరాబాద్‌ పనిచేయనున్నది.

మంగళవారం జరిగిన ‘స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌' సమావేశంలో ఈ నగరాలు మార్గదర్శక ప్రణాళికపై కసరత్తు మొదలుపెట్టాయి. ఈ సమావేశంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ‘అత్యాధునిక సాంకేతికత సాయంతో మా పౌరుల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధానాల రూపకల్పనకు జీ20 దేశాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న జనాభాకు తగిన సౌకర్యాలు కల్పించటం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారుతున్నది. ముఖ్యంగా భద్రత, పౌరుల గోప్యత, సైబర్‌ సెక్యూరిటీ వంటి విషయాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సమస్యలు మరింత జఠిలంగా మారాయి. వీటిని అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై విధానాల రూపకల్పనకు జీ 20 గ్లోబల్‌ స్మార్ట్‌ సిటీస్‌ అలయెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో చేరిన నగరాల్లో డబ్ల్యూఈఎఫ్‌ ప్రణాళికలను ముందుగా అమలు చేసి చూస్తారు. ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత లోపాలుంటే మరింత మెరుగుపర్చి ప్రపంచంలోని ఇతర నగరాలకు విస్తరిస్తారు.