జయలలిత నెచ్చెలి శశికళకు భారీ షాకిచ్చిన ఐటి శాఖ


తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఐటీశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. సిరుత్తవూరు, కొడనాడులో ఉన్న ఈ ఆస్తులు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ పేర్ల మీద ఉన్నాయి.

సదరు స్థిరాస్తుల వద్ద ఐటీ శాఖ నోటీసులు అంటించింది. బినామీల నిషేధ చట్టం ప్రకారం ఆస్తులను అటాచ్‌ చేసినట్టు అందులో పేర్కొన్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల్లో జైలు నుంచి విడుదల కానున్నారు. 2021 మేలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత చనిపోయిన సమయంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం కావాలని ప్రయత్నాలు చేశారు.

కానీ కేసుల్లో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లారు. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం పార్టీని సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్‌సెల్వం నడిపిస్తున్నారు. 2021 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పనీర్‌సెల్వంప్రకటించారు. అదే రోజు శశికళకు చెందిన ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్టు ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం.