GHMC ఎన్నికలు ఎలా జరపాలి?


తెలంగాణలో GHMC ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌తోపాటూ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలపై ద్రుష్టి పెడుతున్నాయి. హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చుతున్నామంటూ టీఆర్ఎస్ ఓటర్ల మెప్పు పొందేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.

గత GHMC ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయం సాధించిన టీఆర్ఎస్ ఇప్పుడు కూడా అదే ఆశిస్తోంది. కానీ అసలు ఈ ఎన్నికలు ఎలా జరిపించాలనే అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమస్యగా, సవాలుగా మారింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరపాలా లేక ఈవీఎంల ద్వారా జరపాలా అన్నది ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. దీనిపై ఈమధ్యే కొన్ని శాఖల అధికారులతో ఎస్ఈసీ పార్ధసారధి సమావేశం నిర్వహించారు.

2021.. ఫిబ్రవరిలో GHMC పాలక మండలికి పదవీకాలం పూర్తవుతుంది. అందువల్ల ఈ సంవత్సరమే ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఐతే కరోనా ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి ఎన్నికలు ఎలా జరపాలనే అంశంపై రాజకీయ పార్టీలనే అభిప్రాయాలు చెప్పాలని కోరింది.

ఇందుకు సంబంధించి అన్ని పార్టీలకూ ఎస్ఈసీ లేఖలు పంపింది. సెప్టెంబర్ చివరికల్లా అభిప్రాయం చెప్పాలని కోరింది. అసలు పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల అంశంపై చర్చిద్దామని ఎస్ఈసీ అనుకుంది. కానీ కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది.