ప్రేమోన్మాది చేతిలో బలయిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన హోమ్ మంత్రి సుచరిత


ప్రేమోన్మాదానికి బలైన ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు.ఈ హత్యలో నిందితునికి ఇతరులు సహకరించరన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాం. టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రవర్తనపైనే కాదు, అబ్బాయిల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే 10 లక్షల సహాయం అందించామ’ని హోంమంత్రి తెలిపారు.

నిందితుడు అఖిల్‌కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్‌కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు