దేవీపట్నంలో ఆలయ గోపురం దాకా వరద నీరు

తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి వరద ప్రవాహం పెరగడంతో మండలంలోని 36 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద ప్రవాహం గండిపోచమ్మ అమ్మవారి ఆలయ గోపురాన్ని తాకుతూ దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి నది మధ్యలో ఎగువ కాఫర్‌ డ్యాం కారణంగా పోచమ్మ గండి నుంచి దేవీపట్నం వరకు పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ముంపు గ్రామాల్లో గత నాలుగు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో కొండలపై ఉన్న వరద బాధితులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

దేవీపట్నంలో 3వేల ఇళ్లు జలదిగ్బంధం

దేవీపట్నం, చినరమణయ్యపేట, పోచమ్మగండి, దండంగి మధ్య ఆర్‌ అండ్‌ బీ రహదారులపై వరదనీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గానుగులగొందు, మడిపల్లి, మంటూరు, ఎ.వీరవరం, కచ్చులూరు, కొండమొదలు వరకు పలు చోట్ల వరద బాధితులు కొండలపైనే తలదాచుకుంటున్నారు. ఆయా ముంపు గ్రామాల్లో గత ఐదు రోజులుగా దాదాపు 3వేల ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి.

అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోగా సోమవారం సాయంత్రానికి ఆలయ గోపురాన్ని వరదనీరు చుట్టుముట్టింది. ఆలయంతో పాటు పోచమ్మగండిలో ఉన్న 50 ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. గతేడాది వచ్చిన వరదలకు అమ్మవారి ఆలయం శ్లాబ్‌ వరకు మాత్రమే వరదనీరు చేరుకోగా.. ఈసారి మాత్రం ఆలయ గోపురానికి చేరుకోవడం గోదావరి మహోగ్రరూపానికి అద్దంపడుతోంది.
ప్రస్తుతం భద్రాచలం వద్ద 61.2 అడుగులకు నీటి మట్టం పెరిగింది. రాత్రి 9గంటల తర్వాత 63 అడుగులకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి నుంచి వస్తున్న వరదనీరంతా ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ వద్దకు చేరుతోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 17.90 అడుగులకు చేరగా.. సముద్రంలోకి 19.21లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.