Breaking news: హైదరాబాద్‌లో భారీ వర్షం... దీంతో రోడ్లన్నీ జలమయం...!

హైదరాబాద్‌లో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలో మేఘాలు కమ్ముకొని వాతావరణం నిమిషాల్లోనే ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆ వెంటనే భారీ వర్షం మొదలైంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం కారణంగానే భారీ వర్షం కురుస్తున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. పంజాగుట్ట, బోరబండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ముషీరాబాద్, గాంధీనగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, షేక్‌పేట, టోలిచౌకి, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, రాంనగర్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి, తదితర చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది.

దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగులు విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరుతుండడంతో ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సోమవారం ఉదయం తీరం దాటే సూచనలున్నాయని, శనివారం నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి గంటకు 45- 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.