నా వెనుక ఎవరు లేని దశలో దాదా నాకు అండగా నిలిచాడు ..హర్భజన్ సింగ్



టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనకి కెప్టెన్‌గా అప్పట్లో ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్.. కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. టీమ్‌లో అప్పటి వరకూ తనకి మద్దతుగా నిలుస్తామని మాట ఇచ్చిన వారు.. వేటు సమయంలో పత్తాలేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేసిన హర్భజన్ సింగ్.. గంగూలీ మాత్రమే తనకి సపోర్ట్‌గా నిలిచాడని వెల్లడించాడు.

నా కెరీర్‌లో ఓ దశలో నా వెనుక ఎవరూ లేకుండా పోయారు. అప్పటి వరకూ మేమున్నాం అని నా ఎదుటే చెప్పినవాళ్లు పత్తా లేకుండా పోయారు. సెలక్టర్లు నా గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటల్ని నేను చెప్పలేను. కానీ.. ఆ సమయంలో కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ నాకు మద్దతుగా నిలిచాడు. నాకు తెలిసి అతని స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా నాకు సపోర్ట్ ఇచ్చేవాడు కాదేమో’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్.. మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు. కానీ.. 2015లో ఆఖరిగా టీమిండియాకి ఆడిన భజ్జీ.. గత ఐదేళ్లుగా మళ్లీ టీమ్‌లో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో హర్భజన్‌ సింగ్‌కి తక్కువ అవకాశాలొచ్చాయి.