ఉచితంగా తాగునీరు సరఫరా... నగర ప్రజలపై కేసీఆర్‌ వరాల జల్లు...


ఎన్నికలు వచ్చిందో వచ్చింది నగర ప్రజలకు కేసీఆర్‌ వరాల జల్లు కురిపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్ట్ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అందులో చాలా మంది దృష్టిని ఆకర్షించిన ప్రధానమైన అంశం పరిశీలిస్తే జంట నగరాల్లో 20 వేల లీటర్లలోపు నీరు వాడుకునే వారికి ఉచితంగా తాగునీరు సరఫరా అందించనుండటం. డిసెంబర్‌ నెల నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నిరుపేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల మీద కొంతైనా ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది అమలులోకి వస్తే 97 శాతం మంది ప్రజలకు మేలు కలుగుతుందని కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గతంలో నగరంలో నీటి సరఫరా విషయానికొస్తే వారం రోజులు, పది రోజులు, ఒక్కో చోట ఒక్కోసారి పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు.

లేకుంటే నగరంలోని గల్లీల్లోకి వాటర్‌ ట్యాంకర్లు వస్తే అక్కడ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం కొట్టుకునే యుద్ధాలను చూశాం. కానీ మిషన్‌ భగీరథ పుణ్యమా అని ఆ ఇబ్బందులన్నీ పోయాయన్నారు. ప్రస్తుతం నగరానికి మాత్రమే అని కాకుండా ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉండేటువంటి హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రాంతాలకు సైతం పుష్కలంగా మంచినీటి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఒకప్పటి నీళ్ల కష్టాలను పోగొట్టినట్టే ఇకపై నీటి బిల్లుల కష్టాలు కూడా పోగొట్టేందుకే ఉచిత మంచి నీటి సరఫరా అందించే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరలా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే 50 ఏళ్లకు సరిపడా తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణం వెనుకున్న వ్యూహం కూడా అటువంటిదే అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎలాగైతేనేమి జీహెచ్ఎంసీ ఎన్నికల వల్ల ప్రజలకు ఉచితంగా త్రాగు నీరు అందనుంది.