అమిత్ షాను కలవనున్న రైతు సంఘాల నేతలు


నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు మంగళవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు.

మంగళవారం నిర్వహించిన 4 గంటల ‘భారత్ బంద్’ ముగియడంతో రైతు సంఘాల నేతలు అమిత్ షాను కలిసేందుకు బయల్దేరారు. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిథి రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రైతు సంఘాల నేతలు సమావేశమవుతారని చెప్పారు. తాము బోర్డర్‌కు వెళ్తున్నామని, అక్కడి నుంచి రైతు నేతలతో కలిసి అమిత్ షాతో సమావేశానికి వెళ్తామని తెలిపారు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులు నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చట్టాలు కార్పొరేట్ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తాయని, కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.