రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఇంటి ముందు నిరసనలు తెలిపిన అభిమానులు...


రజనీకాంత్‌ రాజకీయాలు మొదటి నుంచి గందరగోళంగానే సాగుతున్నాయి. కలకలం రేపే సమాచారంతో రజనీ పేరుతో వెలువడిన ఉత్తరం, రజనీకాంత్‌ గురువారం చేసిన ట్వీట్‌కు కొనసాగింపుగా శుక్రవారం మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజకీయాలకు స్వస్థి పలకనున్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం వెలుగుచూడడంతో రజనీకాంత్‌ అభిమానులు చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి ముందు శుక్రవారం భైఠాయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు...రజనీ రాజకీయాల్లోకి రావాలి అంటూ నినాదాలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఏర్పాటుపై సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు గురువారం రజనీ చేసిన ప్రకటన అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు.

నిరాహారదీక్షలు చేపట్టైనా రజనీతో పార్టీ పెట్టిస్తామని రజనీ మక్కల్‌ మన్రం చెన్నై ఎగ్మూరు శాఖ ఉప కార్యదర్శి కే రజనీ అన్నారు. రజనీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని నమ్ముతున్నట్లు అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారుతుంది, రాజకీయాలు మారుతాయి అనే నినాదంతో కూడిన బనియన్లు వేసుకున్నారు.