రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలపై కరోనా ఎఫెక్ట్ ..80 ఏళ్లలో ఇదే తొలిసారి


కరోనా కారణంగా ఏ పనులు సజావుగా సాగడం లేదు. ప్రతి ఏడాది దేశంలో పండగలను అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. కానీ, ఈ ఏడాది పండగలను పక్కన పెట్టవలసి వచ్చింది. ఉగాది, శ్రీరామనవమి వేడుకలను జరుపుకోలేకపోయాం. వినాయక చవితి వేడుకలు కూడా ఎవరి ఇంట్లోనే వాళ్ళు జరుపుకున్నారు.

అయితే, రాబోయే దసరా, దీపావళి వేడుకలపై కూడా కరోనా పంజా విసురుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పండగలపై ఇప్పటికే కేంద్రం కొన్ని ముందస్తు సూచనలు చేసింది. సమూహాలగా ఏర్పడవద్దని కోరింది. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. అయితే,దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఆ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది.

వేడుకలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలం కాదని, వేడుకలను నిర్వహించకపోవచ్చని, ఎర్రకోటలోని రామ్ లీలా మైదానంలో జరిగే వేడుకలకు ఎన్ఐఏ నుంచి అనుమతులు రాలేదని రామ్ లీలా వేడుకల నిర్వాహకులు స్పష్టం చేశారు. దేశంలో జరిగే అతిపెద్ద వేడుకల్లో రామ్ లీలా మైదాయంలో జరిగే వేడుక కూడా ఒకటి. 80 ఏళ్లలో మొదటిసారిగా వేడుకలను నిర్వహించుకోలేక పోతున్నామని రామ్ లీలా నిర్వాహకులు తెలిపారు.