రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా

రక్షణ శాఖలో కరోనా కలకలం రేగింది. భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. అజయ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ కార్యదర్శికి కోవిడ్ నిర్ధారణ కావడంతో రైసినా హిల్స్ సౌత్ బ్లాక్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కొంత భాగాన్ని సీజ్ చేశారని తెలుస్తోంది. అందులో పని చేస్తున్న 35 మంది అధికారులను హోం క్వారంటైన్లో ఉచ్చారని సమాచారం.

అజయ్ కుమార్‌‌కు కరోనా సోకిందనే విషయం తెలియగానే రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఆఫీసుకు రాలేదని తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా కార్యాలయానికి రాలేదని రిపోర్టులు వస్తున్నాయి.

1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ కుమార్.. కరోనాపై పోరాటంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైరస్ కట్టడి కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జూన్ 1 వరకు ఆయన సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు చేశారు.