కరోనా మహమ్మారికి కుటుంబం బలవన్మరణం

కరోనా మహమ్మారి జనాన్ని పొట్టనబెట్టుకుంటోంది. వ్యాధివచ్చిన వారికి సకాలంలో వైద్యం అందక కొంతమంది, ఆవ్యాధి సోకిన కుటుంబీకులు చిన్న తనంగా భావించి మరికొందరు బలవన్మరణానికి ఒడి గడుతున్నారు. కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది.

కుటుంబ యజమాని కరోనాతో మృతి చెందాడని భార్య, కుమారుడు, కుమార్తె గోదావరిలో దూకారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతిచెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో బంధువులు, సన్నిహితులు కనీసం పలకరించడానికి కూడా రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన సునీత(50), అమె కుమారుడు ఫణికుమార్ (25)‌, కుమార్తె అపర్ణ (23) ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి వీరు ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలకు అంతరాయమేర్పడుతోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.