ఏపీలోని ఆ పట్టణంలో నేడు సంపూర్ణ లాక్ డౌన్


శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు.

గత ఆదివారం లాక్‌డౌన్‌కు ప్రజలు మంచి సహకారం అందించారన్న కలెక్టర్‌.. పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియోగించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదన్న కలెక్టర్.. అంబులెన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్తే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు.

అయితే, అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు కలెక్టర్ జె నివాస్‌.