పంజాబ్ ను తనతో బాటు తీసుకెళ్లిన చెన్నై


ఐపీల్ 2020 లో ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించిన చెన్నై తనతో బాటు పంజాబ్ ను కూడా తోడుగా తీసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో చావో రేవో తేల్చుకోవాల్సిన పంజాబ్ బోర్లాపడింది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లోనూ విఫలమై కీలక మ్యాచ్‌లో ఓటమి పాలయింది. చెన్నై జట్టు ఇంటికి వెళ్తూ వెళ్తూ పంజాబ్‌ను కూడా పట్టుకెళ్లిపోతోంది. పంజాబ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ చేధించారు. 18.5 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి విజయ తీరాలకు చేర్చారు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. 49 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఫాప్ డుప్లెసిస్ 48 రన్స్ చేశాడు. అంబటి రాయుడు 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. టాస్ ఓడి మొదట మ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీపక్ హుడా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహల్ 29, మయాంగ్ అగర్వాల్ 26 రన్స్‌తో పరవా లేదనిపించారు. క్రిస్ గేల్ (12), నిఖోలస్ పూరన్ (2), మందీప్ సింగ్ (14), జిమ్మీ నీషమ్ (2) విఫలమయ్యారు. దీనివల్ల తక్కువ స్కోర్ చేసింది.

మొదట బాటింగ్ చేసిన పంజాబ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 53/1 స్కోర్ చేసింది. అదే జోరు చూసి కింగ్స్ ఎలెవన్ భారీ స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 62 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత స్కోర్ వేగం మందగించింది. తక్కువ వ్యవధిలోనే పూరన్, నీషమ్, గేల్, మందీప్ సింగ్ వెనుదిరగడంతో చాలా తక్కువ పరుగులు చేసింది. ఐతే 18 ఓవర్ నుంచి దీపక్ హుడా గేర్ మర్చాడు. ఆఖర్లో సిక్స్‌లు, ఫోర్లు విరుచుకుపడడం చివరి 3 ఓవర్లో ఏకంగా 40 పరుగులు రావడంతో పంజాబ్ జట్టు 153 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో లుండి ఎంగిడి మూడు వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా తలో వికెట్ సాధించారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 23 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. చెన్నై 14 సార్లు విజయం సాధించగా పంజాబ్ టీమ్ 9 సార్లు గెలిచింది. టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 4న చెన్నై జట్టు 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మరోసారి పంజాబ్‌ను ఓడించిన చెన్నై తమతో పాటు పంజాబ్‌ను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది.