మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ గవర్నర్



ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్‌.. తన ఆమోద ముద్రవేశారు.

తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే..

రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్‌ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది..

అనంతరం 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్‌ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్‌ అయ్యింది. గవర్నర్‌ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ..ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తమ భూములను రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులకు తీరని అయయం జరిగింది అని ప్రతిపక్షాలు విమర్శించాయి ..అయితే అమరావతి రైతులు కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు ..సుప్రీమ్ కోర్ట్ వరకు అయినా వెళ్తాము అని అన్నారు