పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు ...ఏపీ సీఎం జగన్


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం సభను స్పీకర్‌ తమ్మినేని సీతారాం రేపటికి వాయిదా వేశారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించమని సీఎం స్పష్టం చేశారు.

దివంగత నే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామని తెలిపారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆపకూడదని తపన ఉందని, పోలవరం నిర్మాణంలో ఆర్‌అండ్‌ఆర్‌పైన ప్రత్యేక దృష్టి పెడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సభాముఖంగా తెలిపారు.

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వాపోయారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్‌ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశామన్నారు.

పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై రాష్ట్ర తరపున వాదనలు వినిపించామని వెల్లడించారు. పోలవరాన్ని వైఎస్సార్‌ ప్రారంభిస్తే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తున్నారని చెప్పారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహానిస్తామన్నారు.