కరోనా కారణంగా మరో ఎంపీ మృతి...


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా.. ఏ దేశంలోనూ మరణాలు మాత్రం ఆగడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరినీ వదల లేదు. ఇటీవలే కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే తాజాగా గుజరాత్ కు చెందిన బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ కరోనాతో కన్నుమూశారు. ఈ ఏడాది జూలైలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టులో ఆయనకు కరోనా సోకడంతో రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందారు. అక్కడ తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న భరద్వాజ్ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. మాయదారి మహమ్మారి కరోనా వైరస్ వెలుగుచూసి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి ఈ మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కరోనావైరస్ ముక్కు ద్వారా మనుషుల మెదడులోకి ప్రవేశించే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. జర్మనీలోని చరైట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చేసిన ఈ అధ్యయనాన్ని నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ పరిశోధన ఫలితాలు కరోనా రోగుల్లో నాడీ సంబంధ అనారోగ్యాలను గుర్తించడానికి సహాయపడతాయని విశ్లేషకులు అంటున్నారు. వీటి ఆధారంగా రోగ నిర్ధారణ, వైరస్ సంక్రమణను నివారించే చర్యలు తీసుకోవచ్చు. ‘కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థతో పాటు, కేంద్ర నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం వంటి నాడీ సంబంధిత అనారోగ్యాలకు దారితీస్తుంది’ అని అధ్యయనం తెలిపింది.