ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యుత్కు త్వరలో నగదు బదిలీ పథకం అమలు


కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్‌ రంగ సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యుత్‌కు త్వరలోనే నగదు బదిలీ పథకం అమలు చేస్తారని ఈనాడు పత్రిక ప్రచురించింది. దీనికోసం రైతులకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటిలో విద్యుత్‌ బిల్లుల సొమ్మును జమ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసి ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం.కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్‌ రంగ సంస్కరణల్లో భాగంగా విద్యుత్‌ కోసం రైతులకు నగదు బదిలీకి ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కనీసం ఒక జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి, 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగదు బదిలీ కోసం రైతు పేరిట ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ తెరుస్తారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బు నేరుగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అందుతుంది. ప్రతినెలా వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా వచ్చిన బిల్లు సొమ్మును ప్రభుత్వం రైతు బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉచిత విద్యుత్‌ పొందుతున్న 18లక్షలమంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని ఈనాడు తెలిపింది.