జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల అమిత్ షా ట్విట్టర్ వేదికగా సంతాపంజయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల అమిత్ షా ట్విట్టర్ వేదికగా సంతాపం


టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి (74) మంగళవారం గుండెపోటు రావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఇరు రాష్ట్రాల నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఇలా రాశారు. ‘‘గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.’’ అంటూ అమిత్ షా ట్విట్ చేశారు.

జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని కేసీఆర్ తెలిపారు.