రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిన అమిత్ షా...


హోం మంత్రి అమిత్ షా స్వయంగా రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం రాత్రి రైతులతో అమిత్ షా భేటీ కానున్నారు. అమిత్ షాతో చర్చలకు హాజరు కావాలని అటు రైతు సంఘాల నేతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రైతు సంఘాల ప్రతినిధులతో బుధవారం ఉదయం భేటీ కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ నిర్ణయాన్ని సమీక్షించి మంగళవారం రాత్రే రైతులతో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులతో హోం మంత్రి అమిత్ షా భేటీ కావాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నదాతలతో చర్చలు జరిపి వారి నిరసనలకు స్వస్తి పలకాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికైట్‌ మంగళవారం రాత్రి రైతులు చర్చలకు రావాలని హోం మంత్రి అమిత్‌ షా తమను ఆహ్వానించారని పేర్కొన్నారు. అమిత్ షా తమను ఫోన్‌ కాల్‌ ద్వారా సంప్రదించినట్లు తెలిపారు. ఢిల్లీ సమీపంలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులు సమావేశానికి హాజరవుతారని రాకేశ్‌ చెప్పారు.