అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న అదనపు కలెక్టర్


తెలంగాణాలో బారి వర్షాలు ముంచెత్తడంతో అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్‌ మనుచౌదరి సూచించారు. కలెక్టరేట్‌లో అత్యవసర సేవల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 08540-230201ను కంట్రోల్‌రూంలో ఏర్పాటు చేశామన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లోని వారిని ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సూచించారు. పంట, ఆస్తినష్టం వివరాలను ఎప్పటికప్పుడు జిల్లాకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు బుధవారం పలు సూచనలు చేశారు. అధికారులు గ్రామాల్లోనే ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి సంఘటన జరిగినా అధికారులు వెంటనే కంట్రోల్‌రూంకు సమాచారం ఇవ్వాలన్నారు. కుమ్మెరలో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎప్పటికప్పుడు అధికారులు తనీఖీలు చేసి ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ యాస్మిన్‌భాష ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన జిల్లా అధికారులకు సూచించారు. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ హన్మంత్‌రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కుమ్మెరలో ఇల్లు కూలి గాయపడిన వారిని ఆర్డీవో నాగలక్ష్మి, తాసిల్దార్‌ గోపాల్‌తో కలిసి హాస్పిటల్లో పరామర్శించారు.