మనస్థాపం చెందిన యువ ముంబై క్రికెటర్ బలవన్మరణం


కరోనా కారణంగా అవకాశాలు లేక బాగా డిప్రెషన్ కు గురైన ముంబైకి చెందిన యువ క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా ‌ మహమ్మారి వల్ల చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంకావడం, కష్టపడి ఎంత ప్రయత్నించినా సీనియర్‌ జట్టులో స్థానం పొందలేక పోవడంతో మనస్థాపం చెందిన ఓ యువ క్రికెటర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా వల్ల చాలా మంది జీవించలేక వారి జీవితాలు పోగొట్టుకుంటున్నారు. ఇటు మానసికంగానూ అటు ఆర్ధికంగానూ అనేక మంది జీవితంలో కోలుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్ధిక నగరం ముంబైలోని మలాద్‌లో నివసించే కరణ్ తివారీ (27) అనే ముంబై క్రికెటర్‌ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోకెళ్లి గడియపెట్టుకున్న అతడు ఎంతకూ రాకపోయే సరికి అనుమానించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, విగత జీవిగా కనిపించాడు. యువకులు అధైర్యంతో విజయాన్ని సాధించలేక మానసిక వత్తిడికి గురై తమ జీవితాలనే ముగించుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు మాని ఎలాగైనా జీవితంలో ముందుకు రావడానికి గట్టి ప్రయత్నాలు చేసి విజయం పొందాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

కరణ్ తివారీ ముంబై ప్రొఫెషనల్ క్రికెట్ జట్టులో భాగం కాదు కానీ అతడు వారికి నెట్ బౌలర్ గా ప్రాక్టీస్ చేసేవాడు. సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తల్లి, సోదరుడితో కలిసి మలాద్‌లో నివాసముంటున్నాడు. క్రికెట్‌ అంటే అతడికి చాలా మక్కువ. అయితే, తన ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం రావడం లేదంటూ బాధపడుతుండేవాడు. అలాగే, కొవిడ్‌ నేపథ్యంలో చాలారోజులుగా ఆటకు దూరమయ్యాడు. దీంతో మనస్థాపం చెందాడు. చివరకు అందరిని వదలుకొని జీవితాన్ని చాలించాడు.

అసహనానికి లోనై ఈ విషయాన్ని రాజస్థాన్‌లో ఉండే తన మిత్రునితో చెప్పి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు మిత్రుడు కరణ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలోగానే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో పోలీసులు యాక్సిడెంటల్‌ డెత్‌గా కేసు నమోదు చేసుకున్నారు.