వివిధ ప్రాంతాలనుంచి హైదరాబాద్ కు చేరుకున్న స్పీడ్ బోట్లు


గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఇప్పటికే ఏపీ సహా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలని బొట్లు కోసం అభ్యర్ధించారు కేసీఆర్. కేసీఆర్ అడిగిన వెంటనే జగన్ తెలంగాణాకు బోట్లు పంపమని ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ టూరిజం కి చెందిన వివిధ పర్యటక ప్రాంతాల నుండి 40 బోట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి.

ప్రస్తుతం వీటిని రవీంద్ర భారతి వద్ద ఉంచారు. అవసరమైన వరద ప్రభావిత ప్రాంతాలకు బోట్లను ఇక్కడి నుండే పంపనున్నారు అధికారులు. ఇక హైదరాబాద్‌ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురియడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.

లోతట్టు ప్రాంతాలను మరోసారి వరద ముంచెత్తింది. ఇక ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తలసాని పర్యటించారు. వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల ఆర్థికసాయం అందించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హామీ ఇచ్చారు.