ఎన్నో పోషక విలువలున్న ఆకాకరకాయలు


ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటిని ఆకాకర కాయలు లేదా బోడ కాకర అని పిలుస్తారు. చూడటానికి ఇవి కాకరకాయల్లా ఉంటాయి. కానీ, రుచిలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. అందువలన వీటి ధర కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇది శరీరానికి అందించే ఆరోగ్యం అంతా ఇంతా కాదు. ఆ కాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. మరి దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.

* ఆకాకరను వండేప్పుడు వాటిపై ఉండే బొడిపెలను తీయకూడదు. ఎందుకంటే అసలైన పోషకాలు అందులోనే ఉంటాయి. ఆకాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

* ఆకాకరలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. ఆకాకర కాయ కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. ఈ కాయలను తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

* ఆకాకర వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. సాధారణ కాకర కాయ తరహాలోనే ఆకాకర కూడా చక్కర వ్యాధిని నియంత్రిస్తుంది.

* ఆకాకర రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి.

* ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. క్యాన్సర్ల బారిన పడకుండా ఆకాకర అడ్డుకుంటుంది. ఆకాకరలోని విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.