ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై చంద్రబాబు ఆగ్రహం


టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడాన్ని ఖండించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ‘గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం. రాజ్యాంగ విరుద్ధం. కరోనా వల్ల తిండి కూడా లేకుండా ఎంతోమంది అలమటిస్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల మధ్య చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారు. జగన్ ది పైశాచిక ఆనందం. ప్రపంచంలోనూ, దేశంలోనూ ఎక్కడా మూడు రాజధానులు లేవు. చిన్న రాష్ట్రం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సబబు కాదు అందుకే నేను అమరావతికి మద్దతు పలుకుతున్నానని చెప్పిన జగన్ ఎందుకు మడమ తిప్పారు.’ అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

‘ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం ఆంధ్రుల మనోభావాలను, ఆకాంక్షలను పట్టించుకోకపోవడమే. అహంకార పాలకుల స్వప్రయోజనాలకు కొమ్ముకాసేలా ఉన్న ఈ బిల్లులను ఆమోదించడాన్ని ఒక దురదృష్టకరమైన ఘటనగా భావిస్తోంది తెలుగుదేశం.’ అని టీడీపీ ట్వీట్ చేసింది. మరోవైపు అమరావతి ఉద్యమం 2.0 ప్రారంభం అవుతుందని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు ఆగస్టు 15 నాటికి పరిపాలన రాజధాని అమరావతికి తరలిపోయే అవకాశం ఉంది. ఈమేరకు అన్ని ప్రధాన కార్యాలయాల హెచ్‌ఓడీలకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. విశాఖకు తరలివెళ్లేందుకు సిద్దం అవ్వాలని సూచించింది. సెప్టెంబరు నాటకిి పూర్తిస్థాయిలో విశాఖ నుంచి జరగనున్న పాలన కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టు 15న విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పూజ జరగనున్నట్టు సమాచారం. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం తరలిస్తారు. ఆ తర్వాత దశలవారీగా ప్రధాన కార్యాలయాలను తరలిస్తారు.