సకల సౌభాగ్యాల కోసం వినాయక చవితికి వినాయకుడిని పూజించే విధానం


కుటుంబంలో అందరికి సకల సౌభాగ్యాల కోసం వినాయక చవితికి వినాయకుడిని పూజించే విధానం చాలా ముఖ్యమైనది. గణేశ్ చతుర్థి నాడు పూజలు ఎలా చెయ్యాలి? ఏమి నైవేద్యం సమర్పించాలి ఇలా ప్రతీ కార్యక్రమానికీ కొన్ని పద్ధతులు, ఆచారాలూ మన హిందూ సాంప్రదాయాలలో ఉన్నాయి. వాటిని అలాగే పాటిస్తే వ్రత ఫలం ఎక్కువగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అనేది చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి.

మహా గణనాధునికి నైవేద్య పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం. మహా గణపతికి బెల్లం అంటే ఇష్టం. పసుపు వినాయకుడికి బెల్లం, అరటిపళ్ళు, కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే మంచిది. వాటి మీద నీళ్ళు చల్లుతూ ఓం భూర్భు వస్సువ: తథ్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్‌... సత్యం త్వర్తేన పరిషించామి అని నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.

అలాగే అమృతమస్తు పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలాలి. అమృతోపస్తరణమసి అని నైవేద్యం పైన నీళ్లు చల్లి శ్రీ మహాగణాధిపతయే నమ: నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపహారం నివేదయామి... ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అంటూ 5 సార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి.


అమృతాపిథానమసి

శ్రీమహాగణాధిపతయే నమ: ఛత్రమాచ్చాదయామి
చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతామాశ్రావయామి, వాద్యం ఘోషయామి... అశ్వానారోహయామి
గజానారోహ యమామి
శకటానారోహయామి
ఆందోళికానారోహయామి - అని పువ్వు దేవుడిమీద వేయాలి

సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాస్సమర్పయామి అని నీళ్లూ అక్షింతలూ పళ్లెంలో వదలాలి

శ్రీ మహాగణపతి దేవతా స్సుప్రీతస్సుప్రసన్నో వరదో భూత్వా వరదో భవతు ఏతత్పలం పరమేశ్వరరార్ప ణమస్తు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు ఉత్తరే శుభ కర్మణ్యవిఘ్నమస్తు శ్రీమహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని అనాలి.

ఇప్పుడు... పువ్వులు, అక్షింతలు తలపై వేసుకోవాలి.

శ్రీ మహాగణధిపతయే నమ: గణపతిం ఉద్వాస యామి అని పసుపు గణపతిని తూర్పు వైపుకి జరపాలి.

శ్రీ మహాగణాధిపతయే నమ: యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. దీంతో పసుపు గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయినట్లవుతుంది.