కల్పవృక్ష వాహనంపై శ్రీవారు...


వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం వాహన సేవ జరిగింది. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై స్వామి వారు చేతిలో చర్నాకోల పట్టి, తలపాగ, జాటీతో నయనానందకరంగా కనిపించారు. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం ఆలయంలో చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు.

క్షీర సాగర మధనంలో ఉద్భవించిన కల్పవృక్షం నీడన ఉంటే ఆకలి దప్పులు ఉండవని భక్తుల విశ్వాసం. కల్పవృక్షం కింద శ్రీవారి దర్శనం కలిదోష హరణంగా భక్తుల నమ్మకం. కరోనా మహమ్మారి సందర్భంగా వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కల్పవృక్ష వాహన సేవను తిలకించి, తరించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారికి సర్వభూపాల వాహనసేవ జరుగనుంది.