ఆరోగ్యసిద్ధికి అనారోగ్యాల నివారణకు నరసింహస్వామి ఉపాసన


ఆరోగ్యసిద్ధికి అనారోగ్యాల నివారణకు నరసింహస్వామి ఉపాసన ఎంతగానో ప్రత్యేకమైనది. ఆరోగ్యసిద్ధి విషయంలో ‘నరసింహస్వామి ఉపాసన’ చాలా ప్రత్యేకమైంది. నరసింహస్వామిని మృత్యువుకు మృత్యువుగా నమస్కరించే సంప్రదాయం భారతీయలకు, హైందవ మంత్రాస్త్రానికి ఉంది. ‘లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం’ కూడా అన్ని రకాల అనారోగ్యాల నివారణకు ఉపయోగపడుతుంది.

విష్ణుస్వరూపమైన, వ్యాపనశీలమైన నృసింహునికి ఎన్ని నామాలున్నా ‘గరుడధ్వజుడు’ విశేషమైన నామం. ఆకాశంలోని శ్రవణా నక్షత్రం విష్ణు స్వరూపం. అయితే పక్కనే ఉన్న గరుడ మండలం స్వామివారికి ధ్వజంగా, వాహనంగా ఉంటుంది. అందువల్ల, విష్ణు అవతారాలన్నీ గరుడధ్వజులుగానే భావింపబడుతాయి.

శ్రీమన్‌ నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక భుజంగ జలాగ్ని రోగ
క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు॥

అనారోగ్యం వల్ల బాధపడే వారికోసం అనేక రకాల రోగాల నివారణకు నరసింహస్వామి ఉపాసన ఉపయోగపడుతుందని పై శ్లోకం కూడా మనకు చెపుతున్నది. దేహంలోనూ, మనసులోనూ కోరికలనే సర్పాలు అనేకంగా ఉంటాయి. వీటిని సమూలంగా నాశనం చేయడం గరుడునికి మాత్రమే సాధ్యం. స్వామివారిని వేర్వేరు రూపాల్లో అర్చించడం, ఉపాసించడం చేయవచ్చు గానీ, గరుడధ్వజ భావంతో నమస్కరిస్తే దైహిక, మానసిక, కర్మజనిత, భావజనితమైన సర్వరోగాలనుండి నివారణ పొందే అవకాశం కలుగుతుంది. అందుకే, ‘ఓం గరుడధ్వజాయ నమ:’ మంత్రాన్ని ప్రతిరోజూ 1 గంటపాటు స్మరిస్తుంటే, సాధారణమైన రోగాలన్నీ తగ్గుతుంటాయి. వ్యాధి తీవ్ర దశలో నిరంతరం జపం చేయడం మంచిది. ఎంత ఎక్కువగా జపం చేస్తుంటే అంత అధిక ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు.